26, ఏప్రిల్ 2014, శనివారం

దేవాలయాలు,ప్రాజెక్టులు,చారిత్రక కోటలు

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

మహబూబ్‌నగర్ జిల్లా చరిత్ర


మహబూబ్‌నగర్ జిల్లా చరిత్ర
రెవెన్యూ డివిజన్లు - 05
లోక్‌సభ నియోజకవర్గాలు - 02
శాసనసభ నియోజకవర్గాలు - 14
పురపాలక సంఘాలు - 09
Jogulabatemole1 మహబూబ్‌నగర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాల్లో ఒకటి. జిల్లా ముఖ్యపట్టణం, మహబూబ్‌నగర్. ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో కలదు. జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, పశ్చిమమున కర్ణాటక లోని రాయచూరు, గుల్బర్గా జిల్లాలు కలవు. ఈశాన్య దిశలో హైదరాబాదు జిల్లా కలదు. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా ఇది. ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించాడు. రాష్ట్రంలోనే తొలి, దేశంలో రెండవ పంచాయతి సమితి జిల్లాలోనే స్థాపితమైంది. విస్తీర్ణం దృష్ట్యా చూసిననూ, మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా రెండో స్థానంలో ఉంది. కృష్ణా మరియు తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే. దక్షిణ కాశీగా పేరుగాంచినఆలంపూర్ , మన్యంకొండ, కురుమూర్తి, వట్టెం, ఊర్కొండపేట, శ్రీరంగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, బీచుపల్లి, వరహాబాదు లాంటి పర్యాటక ప్రదేశాలు, జూరాల, కోయిలకొండ, ఆర్డీఎస్, సరళాసాగర్ (సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు, చారిత్రకమైన గద్వాల కోట, కోయిలకొండ కోట, చంద్రగఢ్ కోట, పానగల్ కోట లాంటివి మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు.

సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకరరెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఎన్.టి.రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది. పట్టుచీరెలకు ప్రసిద్ధిచెందిన నారాయణపేట, చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజోలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, మామిడిపండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జఠాయువు పక్షి రావణాసురుడితో పోరాడి నేలకొరిగిన ప్రాంతం, దక్షిణభారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతం ఈ జిల్లాలోనివే. ఉత్తర, దక్షిణాలుగా ప్రధాన పట్టణాలను కలిపే 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. 2011, 2012లలో నూతనంగా ప్రకటించబడ్డ 5 పురపాలక/నగరపాలక సంఘాలతో కలిపి జిల్లాలో మొత్తం 9 పురపాలక/నగరపాలక సంఘాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1553 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామపంచాయతీలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట వరి.

భౌగోళికం మహబూబ్‌నగర్ జిల్లా
భౌగోళికంగా ఈ జిల్లా తెలంగాణా ప్రాంతంలో దక్షిణాదిగా ఉంది. విస్తీర్ణం పరంగా తెలంగాణాలో ఇదే అతిపెద్దది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇది రెండో పెద్ద జిల్లా. 16°-17° ఉత్తర అక్షాంశం మరియు 77°-79° తూర్పు రేఖాంశంపై జిల్లా ఉపస్థితియై ఉంది. 18432 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ జిల్లాకు దక్షిణంగా తుంగభద్ర నది సరిహద్దుగా ప్రవహిస్తున్నది. కృష్ణా నది కూడా ఈ జిల్లా గుండా ప్రవేశించి ఆలంపూర్ వద్ద తుంగభద్రను తనలో కలుపుకుంటుంది. ఈ జిల్లా గుండా ఉత్తర, దక్షిణంగా 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మరియు సికింద్రాబాదు-ద్రోణాచలం రైల్వే లైను వెళ్ళుచున్నది. అమ్రాబాదు గుట్టలుగా పిల్వబడే కొండల సమూహం జిల్లా ఆగ్నేయాన విస్తరించి ఉంది. 2001 జనాభా గణన ప్రకారం ఈ జిల్లా జనసంఖ్య 35,13,934[6]. జిల్లా వాయువ్యంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుండగా, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. నడిగడ్డగా పిల్వబడే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో ఉండగా, జూరాలా, దిండి ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉన్నాయి.

చరిత్ర
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు (Palamooru) అని రుక్మమ్మపేట (Rukmammapeta) అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. క్రీ.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా వున్నది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.



ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.

పాలించిన రాజవంశాలు
మౌర్య సామ్రాజ్యం : క్రీ.పూ.250 లో అశోక చక్రవర్తి కాలంలో మౌర్య సామ్రాజ్యం లో ఈ ప్రాంతము దక్షిణ సరిహద్దుగా ఉండేది. శాతవాహన రాజ్యం : క్రీ.పూ.221 నుంచి క్రీ.శ 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో మహబూబ్ నగర్ ప్రాంతం భాగంగా ఉండేది. చాళుక్య రాజ్యం : క్రీ.శ. 5 వ శతాబ్దం నుంచి క్రీ.శ.11 వ శతాబ్దం వరకు ఈ ప్రాంతము చాళుక్య రాజ్యంలో భాగంగా ఉండింది. రాష్ట్రకూట రాజ్యం : క్రీ.శ. 9 వ శతాబ్దంలో కొద్ది కాలం ఇక్కడ రాష్ట్రకూటులు పాలించారు. కాకతీయ రాజ్యం : క్రీ.శ.1100 నుంచి క్రీ.శ.1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు రాజ్యం చేశారు. బహమనీ రాజ్యం : క్రీ.శ.1347 నుంచి క్రీ.శ.1518 వరకు ఇది బహమనీ రాజ్యం లో భాగంగా ఉండింది. కుతుబ్ షాహి రాజ్యం : క్రీ.శ.1518 నుంచి క్రీ.శ.1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్ షాహి రాజ్యంలో భాగం మొఘల్ సామ్రాజ్యం : క్రీ.శ. 1687 నుంచి దాదాపు 37 సం.ల పాటు మహబూబ్ నగర్ ప్రాంతంను మొఘలులు పాలించారు. నిజాం రాజ్యం : క్రీ.శ. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్రం అనంతరం హైదరాబాదు సంస్థానం దేశంలో కల్సే వరకు నిజాం రాజ్యంలో భాగం గానే కొనసాగింది.

ఆధునిక చరిత్ర
హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చినది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1870లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి.స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది.

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి పరిగి తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల, ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు. 1958లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. 1959లో రంగారెడ్డి జిల్లా లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది.

నిజాం విమోచనోద్యమం
నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ప్రముఖ స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. వందేమాతరం రామచంద్రారావు, వందేమాతరం వీరభద్రారావు, కె.అచ్యుతరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సురభి వెంకటేశ్ శర్మ, పాగపుల్లారెడ్డి, ఏగూరు చెన్నప్ప, ఆర్.నారాయణరెడ్డి, కొత్త జంబులురెడ్డి, శ్రీహరి, బి.సత్యనారాయణరెడ్డి లాంటి ప్రముఖులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పంపల్లి, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ లలో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తుర్రేబాజ్ ఖాన్ ఇతను హైదరాబాద్ బ్రిటీష్ రెసిడెన్సీ ( ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీ) పై దాడి చేసినందుకు మొగిలిగిద్ద గ్రామంలోని పోలీస్ స్టేషన్లో సమారు 1940 ప్రాంతంలో బంధించారు. తరువాత ఇతనిని రెసిడెన్సీ గుమ్మానికి ఉరితీసారు.

మహబూబ్ నగర్ జిల్లా సమాచారం
భౌగోళికంగా ఆంద్రప్రదేశ్ లోనే మహబూబ్ నగర్ రెండో పెద్ద జిల్లా. తెలంగాణా లో ఇది అతిపెద్దది. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 పురపాలక సంఘాలు, 2 లోక్‌సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజక వర్గ స్థానాలు కలవు. కృష్ణా మరియు తుంగభద్రలతొ పాటు దిండి, దుంధుబి లాంటి చిన్న నదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు - ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయత్‌రాజ్ రహదారులలో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉన్నది.

పట్టణ ప్రాంతాలు
మహబూబ్ నగర్ జిల్లాలో 10 మున్సీపాలటీలతో పాటు (నగరపంచాయతీలతో కలిపి) అనేక పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి : మహబూబ్ నగర్ (స్పెషల్ గ్రేడ్ మున్సీపాలిటీ), గద్వాల (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), వనపర్తి (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), నారాయణపేట (థర్డ్ గ్రేడ్ మున్సీపాలిటీ), షాద్‌నగర్ (థర్డ్ గ్రేడ్ మున్సీపాలటీ), జడ్చర్ల (మున్సీపాలటి), కల్వకుర్తి (నగర పంచాయతి), కొల్లాపూర్ (నగర పంచాయతి), నాగర్ కర్నూల్ (నగర పంచాయతి), అయిజ (నగర పంచాయతి), ఆత్మకూర్ (మేజర్ గ్రామ పంచాయతి), అచ్చంపేట్ (మేజర్ గ్రామ పంచాయతి). 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో లక్ష జనాభా పైబడి ఉన్న ఏకైక పట్టణం మహబూబ్‌నగర్. జాతీయ రహదారిపై మరియు రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పట్టణప్రాంత జనాభా అధికంగా ఉంది. రెవెన్యూ డివిజన్ల ప్రకారం చూస్తే పట్టణ జనాభా మహబూబ్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగానూ, నారాయణపేట డివిజన్‌లో అత్యల్పంగానూ ఉంది.

జనాభా
1941 జనగణన ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా జనాభా 13.8 లక్షలు కాగా, 2011 జనగణన ప్రకారం 40,42,191. 1941 నుంచి 2001 వరకు ప్రతి 10 సంవత్సరాలకు సేకరించే జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా ప్రక్క గ్రాఫ్‌లో చూపెట్టబడినది. 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 35,13,934 కాగా 2011 నాటికి పదేళ్ళలో 15% వృద్ధిచెంది 40,42,191కు చేరింది. 2011 జనాభా ప్రకారం ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో 9వ స్థానంలో, దేశంలో 55వ స్థానంలో ఉంది. జనసాంద్రత 2001లో 191 ఉండగా, 2011 నాటికి 219కు పెరిగింది. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాద్‌నగర్, జడ్చర్ల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్.

రవాణా సౌకర్యాలు
రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ల నిడివి కల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం సికింద్రాబాదు నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగుళూరు వెళ్ళు దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వేస్టేషన్ వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అందులో మహబూబ్ నగర్, షాద్‌నగర్, గద్వాల, జడ్చర్ల ముఖ్యమైనవి. మహబూబ్ నగర్ పట్టణంలోనే 3 రైల్వేస్టేషన్లు కలవు (మహబూబ్ నగర్ మెయిన్, మహబూబ్ నగర్ టౌన్ మరియు ఏనుగొండ). కర్ణాటకలోని వాడి మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాగుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వేస్టేషన్ ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటక లోని రాయచూరుకు మరో రైలు మార్గపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజురు అయిననూ పనులు ప్రారంభం కావల్సి ఉంది. జిల్లాలో రైల్వేలైన్ల సాంద్రత ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 0.57గా ఉంది.

రోడ్డు సౌకర్యం : దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇదొక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు కలదు. హైదరాబాదు నుంచి కర్నూలు గుండా బెంగుళూరు వెళ్ళు వాహనాలు జాతీయ రహదారిపై ఈ జిల్లా మొత్తం దాటాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు - షాద్‌నగర్, జడ్చర్ల, పెబ్బేర్, కొత్తకోట, ఎర్రవల్లి చౌరస్తా, ఆలంపూర్ చౌరస్తాలు. జిల్లా గుండా మూడు అంతర్రాష్ట్ర రహదారులు కూడా వెళుతున్నాయి. వాటిలో జడ్చర్ల-రాయిచూరు రహదారి ముఖ్యమైనది. ఈ రహదారి మహబూబ్ నగర్, మరికల్, మక్తల్, మాగనూరు గుండా రాయిచూర్ వెళ్తుంది. మరో అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాదు-శ్రీశైలం రహదారి. దీనికి జాతీయ రహదారిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ రహదారి కడ్తాల్, ఆమనగల్లు, కల్వకుర్తిల గుండా జిల్లానుంచి వెళుతుంది. హైదరాబాదు-బీజాపూర్ రహదారి కొడంగల్ గుండా వెళ్తుంది.

బస్ డిపోలు : మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన 8 బస్సు డిపోలు ఉన్నాయి - మహబూబ్ నగర్, గద్వాల, షాద్‌నగర్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్.

జిల్లా రాజకీయాలు
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రస్తుతం 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలున్నాయి. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, సూదిని జైపాల్ రెడ్డి, మల్లు రవి, పాగపుల్లారెడ్డి, డీకె అరుణ, జూపల్లి కృష్ణారావు, నాగం జనార్థన్ రెడ్డి, పి.శంకర్ రావు తదితర ప్రముఖులు జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందగా, పలువులు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీచేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందినాడు. ప్రస్తుత మంత్రివర్గంలో గద్వాల శాసనసభ్యురాలు డి.కె.అరుణ కొనసాగుతుంది.

పార్టీల బలాబలాలు చూస్తే 1983 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 1983లో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 1985లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 1989లో ఒక్కస్థానం కూడా దక్కలేదు. 1994లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్కస్థానం కూడా ఇవ్వలేదు. 1999లో తెలుగుదేశం 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకటి, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్కస్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా నాగర్‌కర్నూల్ నుంచి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావులు రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన రాజేశ్వర్ రెడ్డి మరణించడంతో మొత్తం 3 స్థానాలకు 2012 మార్చిలో ఎన్నికలు జరుగగా మహబూబ్ నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.

మహబూబ్ నగర్ మండలాలు
భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లాను 64 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు

1.కోడంగల్
2.బొంరాస్‌పేట్
3.కోస్గి
4.దౌలతాబాద్
5.దామరగిద్ద
6.మద్దూరు
7.కోయిలకొండ
8.హన్వాడ
9.నవాబ్ పేట
10.బాలానగర్
11.కొందుర్గ్‌
12.షాద్‌నగర్
13.కొత్తూరు
14.కేశంపేట
15.తలకొండపల్లి
16.ఆమన‌గల్
17.మాడ్గుల్
18.వంగూరు
19.వెల్దండ
20.కల్వకుర్తి
21.మిడ్జిల్
22.తిమ్మాజిపేట
23.జడ్చర్ల
24.భూత్‌పూర్‌
25.మహబూబ్ నగర్
26.అడ్డాకల్
27.దేవరకద్ర
28.ధన్వాడ
29.నారాయణపేట
30.ఉట్కూర్
31.మాగనూరు
32.మఖ్తల్‌
33.నర్వ
34.చిన్నచింతకుంట
35.ఆత్మకూరు
36.కొత్తకోట
37.పెద్దమందడి
38.ఘన్‌పూర్
39.బిజినపల్లి
40.నాగర్‌కర్నూల్
41.తాడూరు
42.తెల్కపల్లి
43.ఉప్పునూతల
44.అచ్చంపేట
45.అమ్రాబాద్
46.బల్మూర్
47.లింగాల
48.పెద్దకొత్తపల్లి
49.కోడేరు
50.గోపాలపేట
51.వనపర్తి
52.పానగల్
53.పెబ్బేరు
54.గద్వాల
55.ధరూర్
56.మల్దకల్
57.ఘట్టు
58.అయిజా
59.వడ్డేపల్లి
60.ఇటిక్యాల
61.మానోపాడ్
62.ఆలంపూర్
63.వీపనగండ్ల
64.కొల్లాపూర్

27, జనవరి 2012, శుక్రవారం